అమ్మాయిలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ముఖ్యంగా 25 ఏళ్లలోపు ఉన్న యువతులు రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని ఆయన ఆకాంక్షించారు. యువత ప్రజాసేవలో భాగస్వాములు కావడానికి బీజేపీ తన వంతు సహకారం అందిస్తుందని చెప్పారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీజేవైఎం పదాధికారుల సమావేశానికి పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ప్రతి ఏడాది లక్ష్యాలతో కూడిన క్యాలెండర్ రూపొందించుకుని వాటిని అమలు చేసే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గళమెత్తడంతో పాటు, విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు అందించిన ఏకైక ప్రాజెక్టు పోలవరమేనని చెప్పారు. త్వరలోనే పోలవరం పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. అలాగే, అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్రం భాగస్వామ్యమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో డేటా సెంటర్‌తో పాటు భారీ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత యువతపై ఉందని పీవీఎన్ మాధవ్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు యువత మంచి లక్ష్యాలతో ముందుకు రావాలని, ప్రజాసేవనే ధ్యేయంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.