తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలో ఒకే రాత్రి మూడు ఆలయాల్లో వరుస చోరీలు జరగడం తీవ్ర కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటన స్థానిక భక్తులను ఆందోళనకు గురిచేసింది.
దుండగులు చల్లావారిపల్లిలోని ముత్యాలమ్మ ఆలయం, తాటితోపు కండ్రిగలోని రాములోరి ఆలయం, అంకాళమ్మ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. చల్లావారిపల్లి ముత్యాలమ్మ గుడిలో భక్తులు సమర్పించిన 8 గ్రాముల బంగారు కాసులు, రూ.20 వేల నగదును అపహరించినట్లు సమాచారం. అలాగే తాటితోపు కండ్రిగలోని రాములవారి, అంకాళమ్మ ఆలయాల తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు హుండీలను పగులగొట్టి సుమారు రూ.4 వేల నగదును దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
ఆదివారం ఉదయం పూజల కోసం ఆలయాలకు వచ్చిన గ్రామస్థులు.. గుడి తలుపులు తెరిచి ఉండటంతో పాటు హుండీలు చిందరవందరగా పడిఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
సమాచారం అందుకున్న రామచంద్రాపురం పోలీసులు ఘటనాస్థలాలకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సభ్యులు ఆలయ పరిసరాల్లోని వేలిముద్రలను సేకరించారు. ఇదిలా ఉండగా, ఒక ఆలయంలో దొంగలు హుండీని పగులగొడుతున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఒకే రాత్రి మూడు ఆలయాల్లో చోరీలు జరగడం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు దారితీసింది. ఆలయాల వద్ద భద్రతను మరింత పెంచాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.