ర్షంలోనూ టాప్ గేర్‌లో నిర్మాణ కార్యకలాపాలు సాగిస్తున్నామని మంత్రి లోకేశ్ స్పష్టం చేస్తూ.. సంబంధిత వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి లేదని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలు నిరంతరాయంగా సాగుతున్నాయని తెలిపారు.

ఈ మేరకు అమరావతిలో కొనసాగుతున్న పనులకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం అమరావతి పనులు "టాప్ గేర్"లో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయడం లేదని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని వివరించారు.

వర్షాలు కురిసిన ప్రతిసారి "అమరావతి మునిగిపోయింది" అంటూ దుష్ప్రచారం చేసే వారికి ఈ వీడియో సమాధానమని లోకేశ్ వ్యాఖ్యానించారు. "సారీ బ్రో" అంటూ ట్రోలర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఆయన, భారీ వర్షాల మధ్య కూడా నిర్మాణ పనులు కొనసాగుతున్న దృశ్యాలను ప్రజలకు చూపించేందుకే ఈ వీడియో విడుదల చేశానని చెప్పారు.

అమరావతి గురించి అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు మానుకోవాలని హితవు పలికిన లోకేశ్.. రాజధాని నిర్మాణంలో ఇకపై "పాజ్" అనే మాటకు చోటు లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

నిర్మాణ పనుల వేగం మరింత పెరిగిందని, ఇది నవ్యాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం, పనుల్లో వేగం పెరగడం రాష్ట్ర ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

"స్పీడ్ పెంచిన అమరావతి.. నవ్యాంధ్ర భవిష్యత్తుకు అసలైన గ్యారంటీ" అంటూ మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.