:వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసింది. ఈ ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది.

కాకినాడ జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన భర్తను, వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మొదట గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించినా.. చివరకు ఒక వాట్సాప్ సందేశంతో అసలు నిజం బయటపడింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా సర్పవరానికి చెందిన దుర్గాప్రసాద్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండేళ్ల క్రితం గుండెపోటు రావడంతో స్టెంట్లు వేయించుకుని, అనంతరం ఇంటికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో అతని భార్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసిందని పోలీసులు తెలిపారు.

భర్త తన భార్య ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించి పలుమార్లు నిలదీశాడని, అక్రమ సంబంధాన్ని విరమించుకోవాలని హెచ్చరించాడని సమాచారం. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య, ఆమె ప్రియుడు పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది.

ప్రణాళిక ప్రకారం ప్రియుడు నిద్రమాత్రలు సమకూర్చగా, వాటిని జ్యూస్‌లో కలిపి దుర్గాప్రసాద్‌కు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతను స్పృహ కోల్పోయిన అనంతరం దిండుతో ముఖంపై ఒత్తిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం గుండెపోటుతో మరణించినట్లు బంధువులను నమ్మించారని తెలిపారు.

అయితే, కొంతకాలం తర్వాత మహిళ తన ప్రియుడిని దూరం పెట్టడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో దుర్గాప్రసాద్ మరణానికి సంబంధించిన విషయాలను గోపిసాయి వాట్సాప్ ద్వారా మృతుడి కుమార్తెలకు తెలియజేసినట్లు పోలీసులు వెల్లడించారు. "మీ తండ్రిది సహజ మరణం కాదు.. మీ తల్లే నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసింది" అంటూ పంపిన సందేశాలు కేసులో కీలక ఆధారాలుగా మారాయి.

ఈ విషయాన్ని తెలుసుకున్న దుర్గాప్రసాద్ ఇద్దరు కుమార్తెలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సేకరించిన ఆధారాల ఆధారంగా భర్త హత్యకు పాల్పడిన భార్యను, ఆమెకు సహకరించిన ప్రియుడిని అరెస్ట్ చేశారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబ బంధాలను పక్కనబెట్టి తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.