వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం పాలకొల్లు నియోజకవర్గంలో రూ.2.39 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలు ఐదేళ్లపాటు అధికారాన్ని అప్పగిస్తే అభివృద్ధిని గాలికొదిలేసి జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లోనే కాలం గడిపారని విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగించారని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన ప్రతిసారీ పరదాలు, బారికేడ్లు ఏర్పాటు చేసేవారని, 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేసి ప్రతిపక్ష నాయకులను అడ్డుకునేవారని నిమ్మల ఆరోపించారు. ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నం జరిగిందని అన్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.