శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో దాతలు నిర్మించిన కాటేజీల విషయంలో వివాదం చెలరేగింది. దేవస్థానానికి అప్పగించాల్సిన పలు కాటేజీలు ఇప్పటికీ సంబంధిత దాతల ఆధీనంలోనే ఉన్నాయని శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు విమర్శించారు.
నిబంధనల ప్రకారం కాటేజీల నిర్మాణం పూర్తైన ఏడాదిలోపు వాటిని దేవస్థానానికి అప్పగించాల్సి ఉన్నప్పటికీ, కొందరు దాతలు ఏళ్ల తరబడి వాటిని వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అప్పగించని ఏడు కాటేజీల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబం కూడా శ్రీశైలంలో ప్లాట్ నంబర్ 34లో కాటేజీ నిర్మించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం 2023 మే నెలలోనే ఆ కాటేజీని దేవస్థానానికి అప్పగించాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికీ వారి ఆధీనంలోనే ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో 15 రోజుల్లోపు కాటేజీని దేవస్థానానికి అప్పగించాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీలోగా కాటేజీని అప్పగించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇలాంటి కాటేజీలకు విద్యుత్ బిల్లులు మాత్రం దేవస్థానం చెల్లిస్తోందని బోడేపూడి వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. దేవాలయ అవసరాల కోసం నిర్మించిన కాటేజీలను వ్యక్తిగతంగా వినియోగించడం సరికాదని, స్వచ్ఛందంగా వాటిని దేవస్థానానికి అప్పగించాలని దాతలను కోరారు.
కాటేజీల దుర్వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని దేవస్థానం పాలక మండలి స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం కాటేజీ నిర్మించిన దాతలకు సంవత్సరానికి 30 రోజుల పాటు ఉచిత వసతి, అవసరమైతే ఇతర రోజుల్లో రాయితీ ధరలతో వసతి కల్పించే అవకాశం ఉంటుంది.