ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనమంటూ వ్యాఖ్యానించారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణ వంటి ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించిన ఎమ్మెల్యేను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.

ఎక్స్ వేదికగా స్పందించిన హరీశ్ రావు, ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. "మాది ప్రజా ప్రభుత్వం" అని చెప్పుకుంటూనే ప్రతిపక్ష గొంతును అణిచివేయడం, పోలీసు రాజ్యాన్ని నడపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు.

అధికార అహంకారంతో వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై అణిచివేత చర్యలను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.