ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో చిక్కుకుపోయింది. బయటకు రాలేని పరిస్థితిలో 9 రోజుల పాటు నరకం చూసింది.

అమెరికాలో ఓ 82 ఏళ్ల వృద్ధురాలు ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో చిక్కుకుని తొమ్మిది రోజుల పాటు నరకయాతన అనుభవించింది. నార్త్ కరోలినాలోని క్లైడ్‌కు చెందిన జోన్ రివెట్ జూన్ 1న బాత్‌టబ్‌లో జారిపడి తీవ్ర గాయాలతో బయటకు రాలేకపోయింది.

సహాయం కోసం ఎంతగా అరచినా ఎవరూ వినిపించుకోలేదు. దాహంతో అలమటించిన ఆమె బాత్‌టబ్ కొళాయిని కాలితో తిప్పి, వచ్చిన నీటిని తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకుంది. మరోవైపు, వారం రోజులుగా ఫోన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె సోదరుడు బిల్ లెస్కో పొరుగువారిని సంప్రదించి, అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

జూన్ 10న ఇంటికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న రివెట్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుని ప్రాణాపాయం నుంచి బయటపడింది.