ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘ఔషధ మొక్కలు ఆరోగ్యానికి అసలైన ఆధారం’ వర్క్‌షాప్‌లో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఆయుష్ విభాగంలో రూ.350 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో నాలుగు కొత్త ఆయుష్ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని, ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఒక్కో కాలేజీ కోసం రూ.70 కోట్ల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. తిరుపతి, తెనాలి, నందిగామతో పాటు ఆరు ప్రాంతాల్లో ఒక్కోటి రూ.20 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే 1,500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించామని, 'సంజీవని' డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌ను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అశ్వగంధ, మునగ, ఉసిరి వంటి ఔషధ మొక్కల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు.