మూడు సంవత్సరాల పదవీకాలంతో ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వంఏపీ ఉన్నత విద్య ఫీజు నియంత్రణ కమిటీకి కొత్త సభ్యుల నియామకం

ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ (ఏపీఎచ్‌ఈఎఫ్‌ఆర్‌ఎంసీ) సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ చట్టం–2019 ప్రకారం ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపింది.

ఉత్తర్వుల ప్రకారం కమిటీ సభ్యుల పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా 70 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఉంటుంది. వీటిలో ఏది ముందుగా వస్తే అదే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

చార్టర్డ్ అకౌంటెంట్, పబ్లిక్ ఫైనాన్స్ నిపుణుడిగా తిరుమలశెట్టి వెంకట రంగ సత్య భానుమూర్తిని కమిటీ సభ్యుడిగా నియమించింది. ఉన్నత విద్య పరిపాలన విభాగం సభ్యులుగా డా. మన్యాల రామలింగ రాజు, పూజారి హరి ప్రకాష్‌లను ఎంపిక చేసింది. ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధిగా వీవీఐటీ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డా. వాసిరెడ్డి విద్యాసాగర్‌ను కమిటీ సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.