2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దేశ జీడీపీలో 10 శాతం వాటా అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. నగరంలో ఉన్న పరిశ్రమలను దశలవారీగా బయటకు తరలిస్తామని, మూసీ నది ప్రక్షాళనతో పాటు మెట్రో రైలు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. డీజిల్ బస్సులను దశలవారీగా విద్యుత్ బస్సులుగా మారుస్తున్నామని, విద్యుత్ వాహనాల నమోదుపై జీరో పన్ను అమలు చేస్తున్నామని తెలిపారు.

ప్రపంచంలోని ప్రముఖ ఫార్చ్యూన్ సంస్థలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారబోతోందని, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.