కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని జగన్ తెలిపారు. రైతుల సమస్యలపై ఉద్యమ బాట పడతామని, మరో రెండేళ్లలో రైతు సంక్షేమానికి కట్టుబడి ఉండే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
ఫీడ్, సీడ్ ధరలు ఇష్టారాజ్యంగా పెరుగుతున్నప్పటికీ, రైతులు పండించిన ఉత్పత్తులకు సరైన ధర దక్కడం లేదని జగన్ విమర్శించారు. ఆక్వా రంగంలో సిండికేట్ ఆధిపత్యం వల్ల రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రైతాంగం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని, ప్రతి రైతుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగన్ పునరుద్ఘాటించారు.