ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బహుళ అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్‌లో నిలిపి ఉంచిన ఓ ఎలక్ట్రిక్ బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, వేగంగా భవనమంతా వ్యాపించాయి. దట్టమైన పొగ పై అంతస్తులకు చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, భవనంలో నివసిస్తున్న 50 కుటుంబాలను సురక్షితంగా బయటకు తరలించారు.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య, సహాయక సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ప్రాంతం నుంచి దట్టమైన పొగ వేగంగా పై అంతస్తులకు వ్యాపించడమే ప్రాణనష్టానికి ప్రధాన కారణమని జాయింట్ కమిషనర్ రాజీవ్ నారాయణ్ తెలిపారు. ఈ ఘటనతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.