దర్యాప్తు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ పరిశీలనలు, డీఎన్‌ఏ ఆధారాల సేకరణ వంటి శాస్త్రీయ విధానాలను కచ్చితంగా అమలు చేయాలని పవన్ కల్యాణ్ లేఖలో పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బాలల భద్రత, మహిళల రక్షణ అంశాలపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. చిన్నారులపై పెరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారిక లేఖ రాశారు.

ఈ లేఖలో పోక్సో కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు, త్వరితగతిన న్యాయం అందించేందుకు పలు కీలక సూచనలు చేశారు. కేసు నమోదైన 60 నుంచి 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేయాలని కోరారు. అలాగే ప్రతి పోక్సో కేసులో వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి చేయాలని సూచించారు.

దర్యాప్తు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ పరిశీలనలు, డీఎన్‌ఏ ఆధారాల సేకరణ వంటి శాస్త్రీయ విధానాలను కచ్చితంగా అమలు చేయాలని పవన్ కల్యాణ్ లేఖలో పేర్కొన్నారు.

ప్రత్యేక నిఘా, బాధితులకు రక్షణపై దృష్టి

బాధితులను బెదిరించే నిందితులకు బెయిల్ మంజూరు విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని, అలాంటి నేరస్తులపై రౌడీ షీట్లు తెరిచి నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. బాధిత చిన్నారులకు ప్రత్యేక రక్షణ ప్రణాళిక అమలు చేయడంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక పోక్సో పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

అలాగే పాఠశాలలు, హాస్టళ్లు, ప్రార్థనా స్థలాల్లో బాలల భద్రత కోసం ప్రత్యేక భద్రతా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఈ సూచనల అమలుపై ప్రభుత్వం చేపట్టిన చర్యల వివరాలతో 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని కూడా పవన్ కల్యాణ్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.