మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, వారికి రక్షణపై భరోసా కల్పించడమే "అభయ" కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

అనకాపల్లి: రాష్ట్ర ప్రజలు సైబర్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

బుధవారం అనకాపల్లి జిల్లాలోని వేంపాడు టోల్‌ప్లాజా సమీపంలోని భారతి కన్వెన్షన్‌లో నిర్వహించిన "అభయ" కార్యక్రమాన్ని హోం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా "అభయ" పోస్టర్‌ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.

అనంతరం మాట్లాడిన మంత్రి అనిత.. "మహిళల భద్రత – మా బాధ్యత" అనే లక్ష్యంతో అనకాపల్లి పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, వారికి రక్షణపై భరోసా కల్పించడమే "అభయ" కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

ఎన్నో పోరాటాల ఫలితంగానే మహిళలకు స్వేచ్ఛ, హక్కులు లభించాయని గుర్తు చేసిన మంత్రి.. ఆ స్వేచ్ఛను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మహిళలకు ధైర్యం, భద్రత కల్పించే దిశగా పోలీసులు చేపడుతున్న ఈ కార్యక్రమం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు.

అదే సమయంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు.