రాష్ట్రంలో గత ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రెండేళ్లలో గాడిన పెట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన "ట్రూ అప్" విధానాన్ని "ట్రూ డౌన్" చేసి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు.
గత రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రాబోయే మూడేళ్లలో కూడా విద్యుత్ ధరలను పెంచబోమని ధైర్యంగా చెబుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు.
విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కల్పించేలా 13 పైసల ట్రూ డౌన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని ఆయన పేర్కొన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆరు లక్షల ఉచిత సోలార్ కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని మంత్రి చెప్పారు. సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిలో భాగంగా 160 గిగావాట్ల సామర్థ్య లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.
అలాగే, ఆర్డీఎస్ఎస్ (RDSS) పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ట్రాన్స్‌మిషన్ నష్టాలను తగ్గించేందుకు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.