హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశం

లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ స్థాయి హోదాలో ఉన్న ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏమాత్రం సమంజసం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించిన 63 పిటిషన్లపై విచారణ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

లోతుకుంట ప్రాంతంలోని ప్రైవేటు భూముల్లో హైడ్రా జోక్యాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా కొనసాగితే చట్టపరమైన పాలన (రూల్ ఆఫ్ లా) దెబ్బతింటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

పలుమార్లు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారిని అదే పదవిలో కొనసాగించడం సరికాదని పేర్కొన్న హైకోర్టు, రంగనాథ్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది.