ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంపచోడవరం పర్యటన సందర్భంగా తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్న పదో తరగతి విద్యార్థిని ఎం. శివాని మృతి అత్యంత విషాదకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం అమరావతిలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఒకే వేదికపై ఉత్సాహంగా మాట్లాడిన శివాని ఇక లేరనే వార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. ఎంతో భవిష్యత్తును ఊహించుకుని, ఎన్నో ఆశయాలు, కలలతో ముందుకు సాగాల్సిన గిరిజన బిడ్డ అకాలంగా కన్నుమూయడం తీవ్ర బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు.
పిల్లలకు తల్లిదండ్రులు బలంగా నిలవాలని, వారి కలలను నెరవేర్చేందుకు అండగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనతగా మారకూడదని మంత్రి సూచించారు. కారణాలు ఏవైనా, తన కలలు సాకారం కాకముందే శివాని జీవితం ముగియడం బాధాకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు.
శివాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మంత్రి, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం వారికి కలగాలని ఆకాంక్షించారు.