ముందస్తు బెయిల్‌పై పిటిషన్ కొట్టివేత

సుప్రీంకోర్టులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు దొడ్డా వెంకట సత్యప్రసాద్‌కు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.

ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున పలు అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేయగా, వాటిపై ధర్మాసనం స్పందించింది.

ఈ దశలో పిటిషన్‌ను స్వీకరించలేమని పేర్కొన్న సుప్రీంకోర్టు, కేసు విచారణలో తగిన సమయంలో ఏవైనా చట్టపరమైన అభ్యంతరాలు ఉంటే సంబంధిత కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

దీంతో దొడ్డా వెంకట సత్యప్రసాద్‌కు మంజూరైన ముందస్తు బెయిల్ యథాతథంగా కొనసాగనుంది.