తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు.
ఐసీయూ వార్డుకు చేరుకున్న కేసీఆర్, పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న వైద్య చికిత్సపై వైద్యులతో సమగ్రంగా చర్చించారు. దాదాపు అరగంట పాటు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స విధానం, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అవసరమైతే విదేశీ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం గుండె, ఊపిరితిత్తులు సహా ఇతర కీలక అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయని, అయితే మెదడు పూర్తిస్థాయిలో స్పందించేందుకు మరికొంత సమయం అవసరమని వైద్యులు వివరించారు. మెదడు పునరుత్తేజం పొందేందుకు మరో 48 గంటలు పట్టే అవకాశం ఉందని తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.