రంపచోడవరం మండలంలో పదో తరగతి విద్యార్థిని ఎం. శివాని ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో ధైర్యంగా మాట్లాడి అందరి ప్రశంసలు అందుకున్న శివాని, అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ నెల 24న రంపచోడవరం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతూ, "సార్.. నేను ఏదో ఒకటి సాధిస్తాను. మీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటాను" అని ఆత్మవిశ్వాసంతో చెప్పిన శివాని మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని ఇక లేరనే వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆత్మహత్యకు ముందు శివాని రాసిన లేఖలో కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, బాధ, ఆవేదన వ్యక్తమయ్యాయి. "అమ్మా, నాన్నా... మీ కోసం ఎంతో చేయాలని అనుకున్నాను. మీరు కలలుగన్న జీవితాన్ని మీకు ఇవ్వాలని అనుకున్నాను. కానీ నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. బతకాలని ఉంది... కానీ బతకడం చాలా కష్టంగా అనిపిస్తోంది" అని ఆమె రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.
అలాగే, "అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ... మీరు ఎప్పటికైనా కలవండి. ఒకరినొకరు ద్వేషించుకోకండి" అంటూ తన చివరి కోరికను లేఖలో పేర్కొంది. కుటుంబ సభ్యులు ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ చివరగా క్షమాపణలు చెప్పి జీవితానికి వీడ్కోలు పలికింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఈ విషాద ఘటనతో రంపచోడవరం ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.