చట్టాన్ని ఎప్పుడూ గౌరవించాను.. పత్రాలను నమ్మే భూమి కొనుగోలు చేశాం: మాజీ స్పీకర్ వివరణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం తనపై నమోదైన భూమి కొనుగోలు కేసుపై స్పందించారు. తాను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన భూమి కొనుగోలు వ్యవహారంలో ఎలాంటి అక్రమ మార్గాలను అనుసరించలేదని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను నమ్మి, వాటి ఆధారంగానే భూమిని కొనుగోలు చేశామని చెప్పారు. ఒక సాధారణ కొనుగోలుదారుడిలాగే పత్రాలను పరిశీలించి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశామని వివరించారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్ని పత్రాలను సమర్పించామని, అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో కానీ, ఆ తర్వాత కానీ ఆ భూమిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.