చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్, నీళ్ల ట్యాంకర్‌ను ఢీకొని జనంపైకి దూసుకెళ్లిన లారీ

చిత్తూరు జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. శాంతిపురం మండలం కడపల్లె వద్ద కుప్పం–పలమనేరు జాతీయ రహదారిపై అదుపుతప్పిన మినీ లారీ బైక్‌ను, రోడ్డుపక్కన నిలిచిన నీళ్ల ట్యాంకర్‌ను ఢీకొని జనంపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో శివపురానికి చెందిన సుందరప్ప (60) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మునివెంకటమ్మ (55), అనంతపురం జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలుడు సాత్విక్ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదంలో కడపల్లెకు చెందిన అక్షయ, నందిని, కనకవల్లి, సతీశ్, లక్ష్మితో పాటు మినీ లారీ డ్రైవర్ కుప్పుస్వామి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న కుప్పం డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.