మోక్ష మార్గంలో వరుస ప్రమాదాలు.. కీలక నిర్ణయం తీసుకున్న అరుణాచలేశ్వర ఆలయ అధికారులు

అరుణాచలేశ్వర స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలోని ఇడుక్కు పిళ్లైయార్ గుహ (మోక్ష మార్గం)లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఆలయ అధికారులు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు.

ఇకపై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే భక్తులను మోక్ష మార్గంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఊబకాయులు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గుహలోకి ప్రవేశించవద్దని తెలుగు, తమిళం, ఆంగ్ల భాషల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

భక్తుల విశ్వాసం ప్రకారం ఈ ఇరుకైన రాతి మార్గం గుండా ప్రయాణిస్తే పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం ఉంది. అయితే మార్గం అత్యంత ఇరుకుగా ఉండటంతో భక్తులు పాకుతూ వెళ్లాల్సి వస్తుంది. దీంతో లావుగా ఉన్నవారు లేదా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.